Sunday 21 September 2014

విక్రమార్కుడు-పరకాయవిద్య


ఒక ఊరిలో ఒక రాజు. ఆయన పేరు విక్రమార్కుడు.అతనికి ఒకాయనతో స్నేహం కుదిరింది. ఆయన చెడ్డవాడు. విక్రమార్కుడికి పరకాయవిద్య వొచ్చు. విక్రమార్కుడు సావాసగాడికి పరకాయ విద్య నేర్పుతున్నాడు. అది ఎలా ఉంటుందో నేర్పడానికోసం చనిపోయిన చిలుకలోనికి ప్రవేశించాడు. ఇంక మిగిలిన శరీరంలోకి స్నేహితుడు ప్రవేశించాడు. ఇదే బాగుందని అట్టనే ఉండిపోయాడు. చిలుక శరీరంలోకి వెళ్ళిన విక్రమార్కుడు గాలిలోకి ఎగిరిపోయాడు. స్నేహితున్ని రాజు అనుకొని ప్రజలు నమ్మారు.

    విక్రమార్కుని భార్య ఆయన నడక,  అయన మాటల్ని గుర్తు పట్టింది. మంత్రికి కూడ ఈ విషయం తెలిసింది.  ఆ మంత్రి పేరు భట్టి. భార్య, నేను వ్రతం పట్టినాను అని అన్నది. అట్లా దొంగ విక్రమార్కుని నుంచి తప్పించుకున్నది. ఒక పెద్ద కొండ మీద 99 హంసలతో చిలక స్నేహం చేసి వాటితో నివసిస్తున్నది. కొన్ని రోజుల తర్వాత రాత్రి ఒక ముసలి కాకి వచ్చింది. ఏమిటీ విచారంగా ఉన్నావు, అని అడిగింది చిలుక. ఈ రాత్రి మీవద్ద నిద్ర పోతాను అన్నది ముసలి కాకి. కాని హంసలు మాత్రం ఒప్పుకోలేదు. చిలక, పాపం ముసలి కాకిలే అని ఒప్పించింది. ముసలి కాకి ఉదయం లేచి వెళ్ళిపోయింది. కొద్ది రోజులకి అక్కడ ఒక  మర్రి చెట్టు మొలిచింది. కొద్ది సంవత్సరాలకు మర్రి చెట్టు పెద్ద చెట్టు అయ్యింది. అక్కడ ఉన్న హంసలు చెట్టు మీద నిద్రపోవడానికి అలవాటు పడ్డాయి.
      
    ఇదంతా ఒక బోయవాడు చూశాడు. పక్షులను చంపాలని ఉచ్చులు పెట్టాడు. పక్షులు ఇవి గమనించలేదు. పగలు మాత్రం వేటాడి వచ్చిన పక్షులు ఉచ్చులలో వాలి చిక్కుకున్నాయి. బోయవాడు వచ్చేటప్పటికి మనం చనిపోయినట్లు నటించాలి. అప్పుడు ఒక్కొక్క పక్షిని బోయవాడు ఎంచుకుంటాడు. ఉచ్చులు తీస్తాడు. వంద కాంగానే ఎగిరిపోదాం అని చిలక అన్నది.

        తెల్లవారి బోయవాడు వచ్చాడు. అవి ఎలా అనుకున్నాయో అలానే చేసాయి. కానీ బోయవాడి కత్తి కిందపడగానే వంద పక్షులు అయిపోయినాయి అని అనుకొని ఎగిరి పోయాయి. ఇంత మోసం చేస్తారా అని బోయవాదు చిలక గొంతు పిసకబోయ్యుండు. అప్పుడు చిలక,  నన్ను చంపితే నీకు ఏమీరాదు. కనుక నువ్వు నన్ను ఒక ఊరిలో అమ్మితే నీకు డబ్బులయినా వస్తాయి అన్నది. అఖరికి ఒక పేదవాడైన గుగ్గిళ్ళు అమ్మే పొలిశెట్టి, ఎంత చిలక  అని అన్నాడు? పొలిశెట్టి !  నువ్వు నన్ను కొనుక్కొ . నేను నీ చిన్న కొట్టును  పెద్ద కొట్టుగా చెస్తాను  అని అన్నది. పొలిశెట్టి చిలక మాటలు నమ్మి చిలకను యాభై నాణాలకు కొనుక్కున్నాడు. పొలిశెట్టి దగ్గర మాటలు చెప్పే చిలక ఉందని అందరు పోలిశెట్టి అంగడికి వచ్చారు.  సరుకులు బాగా కొన్నారు. చిన్నకొట్టు పెద్దకొట్టు అయ్యింది. చిలక తీర్పులు కూడ చెప్పను మొదులు పెట్టింది. ఆ ఊల్లో రంగసాని ఉంది. బజారున పోయే వాళ్ళను మోసగిచ్చి డబ్బులు వసూలు చేసేది. జనం చిలక దగ్గరకి తీర్పు కొసం పోయారు. ఇది మంచి పద్దతి కాదని చిలక తీర్పు చెప్పింది.  రంగసాని కోపంతోటి ఇంటికి వెల్లి ఆ దేశపు  రాజు దగ్గర స్నేహం కుదుర్చుకున్నది.
                
                    నాకు తల నొప్పివచ్చింది  మాట్లేడే చిలక  రక్తం కావాలి. పోలిశెట్టి దగ్గర చిలక మాట్లాడుతుంది. నాకు అది కావాలి అన్నది. రాజు పోలిశెట్టికి వెయ్యి నాణాలు ఇచ్చి చిలకను తెచ్చాడు. ఆమె ఆ చిలకను తీసుకుని దాసికి ఇచ్చింది. దాసి చిలక బొచ్చును వలుస్తుంది. ఇంతలో పొయ్యి మీద అన్నం పొంగింది. అన్నం పొంగి పోతుందని ఆమె పోయికాడికి పోయింది.  అంతలోకి చిలక గవాజిలోకి తప్పించుక పోయింది. దాసి వచ్చేసరికి చిలక కనబడలేదు. దానికి ఒక పిల్లి కనిపించింది. పిల్లిని చంపి వండి పెట్టింది. గవాజీలోనే ఎంగిలి మెతుకులు తింటా ఉండింది చిలక. రెండు నెలలకు చిలకకు బొచ్చు వచ్చింది. ఇంక చిలక ఎగిరిపోయింది. ఊరి చివర ఒక గుడిలో ఉన్నది. కొన్ని సంవత్సరాల అయినాక  రంగసాని గుడి రావడం గమనించింది. శివుడు ప్రత్యక్షమై రావాలని ఆమె పూజలు చేసేది. ఒక రోజు శివుడిని ఎప్పుడు సామి నాకు ప్రత్యక్షమయ్యేది అని ఆమె  అడిగింది. అప్పుడు శివుని వెనక ఉన్న చిలక నీ ఇల్లు, ఆస్థి దాన ధర్మాలు చేసిరా అని శివుని మాదిరిగా అన్నది. అప్పుడు నేను స్వర్గానికి వెల్తున్నానని వూరు మొత్తం దండోరా వేయించింది . చుట్టు పక్కల ఉండే జనం తిరనాలకు వచ్చినట్టు వచ్చింన్రు. డబ్బులన్నీ వాళ్ళకి పంచింది.
                       అప్పుడు అమె స్వర్గానికి వెళ్ళడానికి ఏమి చెయాలని అడిగింది. శివుని వెనక నుంచి  చిలక , ఉట్టి కట్టు అని అన్నది . మల్లా ఉట్టి మీదకు  ఎక్కు అని అన్నది. నాకు ఉట్టి అందడం లేదని ఆమె అనేసరికి, ఉట్టి ఎక్కలేని దానివి స్వర్గానికి ఎలా ఎక్కుతావు అని చిలక బర్రున లేచి పోయింది.
              విక్రమార్కుని జాడ తెలియ లేదని భట్టి వెతుకుతూ ఉన్నాడు.ఇక్కడ ఎదో తిరనాల జరుగుతూందని దగ్గరకు వచ్చి చూసాడు. చిలక భట్టి భుజాల మీద వాలింది. నేను చిలక రూపంలో ఉన్నాను అని మట్లాడింది. అప్పుడు ఆయన చిలకను తీసుకుని పోయాడు. ఈ సంగతంతా విక్రమార్కుని భార్యకి చెప్పాడు.
               అప్పుడు భట్టి పొట్టెల్ల పందెం ఏర్పాటు చేశాడు. పందెంలో భట్టి తెచ్చిన పొట్టేలు దొంగ రాజు పొట్టేలును కుమ్మి చంపేసింది. అది తట్టుకోలేక దొంగ రాజు పరాకాయ మంత్రంతో పొట్టేలులోకి పోయిండు. చిలక రూపంలో ఉన్న విక్రమార్కుడు తన శరీరంలోకి ప్రవేశించాడు. చెడ్డవాడు పొట్టేలు రూపంలోనే మిగిలి పోయిండు.


(ఈ కత మిన్నలుకు వాళ్ల నానమ్మ శనివారం రాత్రి చెప్పింది. అది విని మిన్నల్  రాసింది)

1 comment:

  1. విఠలాచార్య దర్శకత్వంలో కాంతారావు చేసిన "గురువును మించిన శిష్యుడు సినిమా" కథ ఇది. విక్రమార్కుణ్ణిపెట్టారు మీరు కథలో. బాగుంది.

    ReplyDelete