Thursday 6 November 2014

నీకు ఒక రొట్టె నాకు రెండు రొట్టెలు


   
               ఒక ఊరిలో భార్యాభర్త జంట ఉంది. వాళ్ళు పనికి పోయి చెరి పది రూపాయలు సంపాయించి, వాటితో పడి జొన్నలు తెచ్చుకున్నారు. ఇద్దరూ కలిసి వాటిని ఇసుర్రాయిలో పోసి ఇసిరిండ్రు. భర్త పచ్చడిలోకి మిరపగాయలు తేవడానికి వెళ్ళాడు. ఆ సమయంలో భార్య మూడు రొట్టెలు చేసింది. భర్త తెచ్చిన మిరపగాయలతో పచ్చడి చేసింది. భర్త నీకు ఒక రొట్టె, నాకు రెండు రొట్టెలు అన్నాడు. భార్య నీకే ఒక రొట్టె, నాకు రెండు రొట్టెలు అని అడ్డం తిరిగింది. నీకు ఒకటి, నాకు రెండూ అని మొగుడంటే, కాదు నీకే ఒకటి,  నాకు రెండు అని పెండ్లాం తగాదకు తీసుకున్నది.
   
    చివరకు ఇద్దరూ కలిసి ఒక పందెం వేసుకున్నారు. సరే అయితే మనం పందెం పెట్టుకుందాం. ఈ రాత్రి నుంచి తెల్లవారి పొద్దెక్కిందాకా ఎవరైతే కదలకుండా ఉంటరో వాళ్ళకు రెండు రొట్టెలు అని అన్నాడు భర్త. భార్య ఒప్పుకుంది. వాళ్ళు అనుకున్నట్లే అంతా జరుగుతోంది. ఎవ్వరూ కదలడం లేదు.
   
    కానీ పొద్దున్నే పక్క ఇంట్లో వాళ్ళు, ఏమి చప్పుడు లేదే అని వచ్చి చూసారు. వచ్చి వాళ్ళ చెయ్యి పట్టుకొని కదిలించారు. కానీ వాళ్ళు పలకలేదు. కదలలేదు. వాళ్ళు చచ్చిపోయారు అనుకున్నారు. చుట్టుపక్కల అందరూ వచ్చి కొంచెం సేపు ఏడ్చారు. ఇంక వాళ్ళని కాల్చడానికి స్మశానానికి తీసుక పోయారు. వాళ్ళకి అగ్గి పెట్టారు.
   
    మంట సెగ తగిలేసరికి భర్త ఓర్చుకోలేక పక్కకు తిరిగాడు. అప్పుడు భార్య లేచి, ఏయ్ ! ఓడిపోయినావు ఓడిపోయినావు. ఇంక నీకు ఒక రొట్టె నాకు రెండు రొట్టెలు అని చప్పట్లు కొట్టి నవ్వింది. అది చూసిన జనం, వాళ్ళు దయ్యాలు అనుకొని  భయపడి అక్కడి నుంచి పరిగెత్తారు. అప్పుడు వాళ్ళు, ఉండండి, ఉండండి. మేము దయ్యాలం కాదు అని నచ్చచెప్పారు. జరిగిన విషయం చెప్పారు.
   
    అది విన్న జనం, వోర్నీ అని ముక్కున వేలేసుకున్నారు.

                                                                                                                                                                                                                                                                 -మిన్నల్
                                                                                                                                                                                                                                 

No comments:

Post a Comment