Sunday 14 December 2014

ముగ్గురు కొడుకులు



అనగనగా ఒక ఆమె. ఆమెకు ముగ్గురు కొడుకులు. చిన్న కొడుకు ఏమీ పని చేయడు. పెద్దకొడుకు, రెండో కొడుకు చేపలు పట్టడానికి వెళ్తారు. చిన్నకొడుకుకు లోకం తెలియదు. ఎప్పుడూ ఇల్లిల్లూ తిరుగుతూ అందరికీ పేలు చూస్తాడు. చిన్న కొడుకంటే తల్లికి చాలా ఇష్టం. ఓనాడు పెద్దకొడుకు భార్యకు కోపం వచ్చింది.
    కష్టపడి వచ్చేది మనం. ఊరకే తినికూచ్చునేది మాత్రం మీ తమ్ముడా. ఎంతకాలం ఇట్లా నావల్లకాదు అనింది. కానీ మా అమ్మకు వాడంటే చాలా ఇష్టం కదా మరి ఎట్లా అన్నాడు పెద్దకొడుకు. చివరకు ఒకరితో ఒకరు మాట్లాడుకొని  చిన్నకొడుకును చంపేయాలి అనుకున్నారు.
    అప్పుడు ఒక పాము వాళ్ళకు కనిపించింది. దాన్ని చంపి, బాగా కడిగి తీసుకోనొచ్చారు. తల్లికి చేపలని ఇచ్చి వండమన్నారు. అప్పటికి చిన్న కొడుకు ఒకామెకు పేలు చూసి వచ్చాడు. పేలు చూసిన తర్వాత రెండుచేతులతో పేలు చూయించుకున్నవాల్ల తలకు రెండు వైపులా మెటికలు విరిచి రావాల. ఆరోజు ఆమెకు మెటికలు విరచలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ విషయం గుర్తుకు వచ్చింది.
    అమ్మా నేను ఈ రోజు ఒకామెకు పేలు చూసి వచ్చాను. మెటికలు విరచలేదు. మరచి పోయివచ్చాను అన్నాడు. సరే బాబూ,  మెటికలు విరిచి వచ్చినాక తిరిగి వచ్చి అన్నం తిందువుగానీ అన్నది వాళ్ళమ్మ. వాడు మెటికలు విరిచి రావడానికి కొంచెం సమయం పట్టింది. ఇంటికి తిరిగి వచ్చి అన్నం పళ్ళెం మీద మూత తీసి చూసేసరికి అక్కడ బంగారు తునకలు ఉన్నాయి.
    తల్లి విషయం అర్థం చేసుకునింది. నువ్వు ఈ బంగారు తునకలు తీసుకొని ఎక్కడన్నా బతుకు పో నాయనా అన్నది.                                                              
                                                                                                     -మిన్నల్

No comments:

Post a Comment